అడవిలో తాగొద్దన్న అధికారిపై దాడికి దిగిన రౌడీలను పోలీసులు అరెస్ట్.

అడవిలో తాగొద్దన్న అధికారిపై దాడికి దిగిన రౌడీమూకను పోలీసులు అరెస్ట్ చేశారు..తెలంగాణలోని మాజీ ఎమ్మెల్సీ కుమారులమని చెప్పుకొన్న వారు మంగళవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై గూండాగిరి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. ఈడ్చుకెళ్లారు. కాళ్లు మొక్కితేనే వదిలిపెడతామని మొక్కించుకున్నారు.
హైదరాబాద్‌ నుంచి శ్రీశైల మల్లన్న దర్శనానికి జెడ్‌.దయానంద్‌, ఎం.శ్రీనివాసు, ఎన్‌.అభినయరెడ్డి, కౌసర్‌, పి.అశోక్‌ కుమార్‌, రాజు అనే వ్యక్తులు మంగళవారం రాత్రి కర్నూలు జిల్లా సున్నిపెంటలోని అక్కమహాదేవి గ్రాండ్‌ లాడ్జిలో దిగారు. రాత్రి 11.45 గంటల సమయంలో వారు అటవీశాఖ కార్యాలయం సమీపంలోని ప్రహరీవద్ద కారులో కూర్చుని మద్యం తాగుతున్నారు. ఇది గమనించిన అటవీశాఖ సెక్షన్‌ అధికారి జ్యోతి స్వరూప్‌ వారివద్దకు వచ్చి అటవీ ప్రాంతంలో మద్యం తాగకూడదని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు సెక్షన్‌ అధికారిపై దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని లాడ్జికి తీసుకెళ్లారు. సెక్షన్‌ అధికారిని బూతులు తిడుతూ… దాడి చేస్తుండగా అక్కడే ఉన్న లాడ్జి సెక్యూరిటీ గార్డు, రిసెప్షనిస్టుతోపాటు మరికొందరు యాత్రికులు గుడ్లప్పగించి చూశారు తప్ప అడ్డుకోలేదు. కాళ్లు పట్టుకుంటేనే వదిలిపెడతామంటూ ఎడాపెడా చెంపదెబ్బలేశారు. వీరి దౌర్జన్యంతో భయపడిపోయిన జ్యోతి స్వరూప్‌ వారిలో ఒకరి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. అయినా వదలకుండా ఆయనను కారులో ఎక్కించుకుని స్టోర్‌ సెంటర్‌, వెస్ట్రన్‌ కాలనీ, బస్టాండ్‌ ప్రాంతాల్లో తిప్పుతూ పదేపదే దాడికి పాల్పడ్డారు.తెల్లవారిన తర్వాత బుధవారం ఉదయం 9.30 గంటలకు జ్యోతి స్వరూప్‌ నేరుగా సున్నిపెంట రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకుని దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. లాడ్జికి వెళ్లి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వసతి గదులను తనిఖీ చేసి మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు.

Updated: December 2, 2018 — 3:54 pm